![]() |
1973లో ‘తాత మనవడు’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన దాసరి నారాయణరావు 2014 వరకు 150కి పైగా సినిమాలు చేశారు. విభిన్నమైన కథాంశాలతో ఆయన తెరకెక్కించిన సినిమాలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. వాటిలో ప్రధానంగా చెప్ప్పుకోవాల్సిన సినిమా ‘ప్రేమాభిషేకం’. అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి జంటగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. రన్ పరంగా అప్పటికి, ఎప్పటికీ క్రాస్ చెయ్యలేని రికార్డును ఈ సినిమా సాధించింది.
ఇదిలా ఉంటే.. 1976లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ‘జ్యోతి’ చిత్రం ఆధారంగానే దాసరి ‘ప్రేమాభిషేకం’ చిత్ర కథను అల్లారనే మాట ప్రస్తుతం వినిపిస్తోంది. అయితే అందులో నిజానిజాలు ఎంత, ఆ సినిమా కథను స్ఫూర్తిగా తీసుకొని ‘ప్రేమాభిషేకం’ చిత్రాన్ని రూపొందించారా, ఆ సినిమాకి, ఈ సినిమాకి ఉన్న వ్యత్యాసం ఏమిటి అనేది తెలుసుకుందాం.
1976లో నవలా రచయిత్రి సి.ఆనందరామం రాసిన ‘మమతల కోవెల’ నవలను సినిమాగా తెరకెక్కించాలని నిర్మాత క్రాంతికుమార్ భావించారు. ‘జ్యోతి’ పేరుతో ఈ చిత్రాన్ని రాఘవేంద్రరావు తెరకెక్కించారు. ఈ సినిమాలో రవిగా మురళీమోహన్, జ్యోతిగా జయసుధ, రాజయ్యగా గుమ్మడి, విశాలగా కృష్ణకుమారి ప్రధాన పాత్రలు పోషించారు. కథ విషయానికి వస్తే.. బావామరదళ్లయిన రవి, జ్యోతి ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాలనుకుంటారు. రవికి విదేశాల్లో చదువుకునేందుకు స్కాలర్‌షిప్ రావడంతో అతను అమెరికా వెళ్లిపోతాడు. అతను వెళ్లిన తర్వాత జ్యోతికి జబ్బు చేస్తుంది.
హాస్పిటల్‌లో చేరిన జ్యోతికి అక్కడే చికిత్స తీసుకుంటున్న విశాల పరిచయమవుతుంది. ఇద్దరూ అకాచెల్లెళ్లులా కలిసిపోతారు. తన గురించి పూర్తిగా చెబుతుంది విశాల. త్వరలోనే చనిపోబోతున్న ఆమె.. తన చివరి కోరిక తీర్చమని జ్యోతిని అడుగుతుంది. దానికి జ్యోతి ఒప్ప్పుకుంటుంది. అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరిన జ్యోతి.. తనకు క్యాన్సర్ అనే విషయం తెలుసుకుంటుంది. తను కూడా ఎక్కువ కాలం బ్రతకదు. తను చనిపోతే రవి భరించలేడు. అందుకే అతను విదేశాల నుంచి వచ్చేలోపు విశాల కోరిక ప్రకారం తన కంటే వయసులో ఎంతో పెద్దవాడైన విశాల భర్త రాజయ్యను పెళ్లి చేసుకుంటుంది జ్యోతి. అతనికి శశి అనే కూతురు కూడా ఉంటుంది. విషయం తెలుసుకున్న రవి.. జ్యోతిని నానా మాటలు అంటాడు. ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నావని నిందిస్తాడు. ఆమెను అసహ్యించుకుంటాడు. అయితే ఆ తర్వాత జ్యోతి ఎక్కువ కాలం బ్రతకదు అనే విషయం రవికి తెలుస్తుంది. రవి పెళ్లి చేసుకొని సుఖంగా ఉండడమే తన చివరి కోరిక అని చెబుతుంది జ్యోతి. అలా రవికి, రాజయ్య కుమార్తె శశికి పెళ్లి జరుగుతుంది. ఆ మరుక్షణమే జ్యోతి కన్నుమూస్తుంది. ఇదీ ‘జ్యోతి’ చిత్ర కథ.
ఇక ‘ప్రేమాభిషేకం’ కథ విషయానికి వస్తే.. ఈ సినిమాలో రాజేష్‌గా అక్కినేని నాగేశ్వరరావు, దేవిగా శ్రీదేవి నటించారు. తొలి చూపులోనే దేవిని ప్రేమిస్తాడు రాజేష్. ఆమె వెంట పడి ప్రేమించమని వేధిస్తుంటాడు. ఆ క్రమంలో రాజేష్‌ను ఎన్నోసార్లు అవమానిస్తుంది దేవి. రాజేష్‌ది నిజమైన ప్రేమ అని తెలుసుకున్న దేవి అతని ప్రేమను అంగీకరిస్తుంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు. పెళ్లికి మంచి ముహూర్తం పెడతారు. శుభలేఖలు కూడా అందరికీ పంచిపెడతారు. సిగరెట్లు విపరీతంగా తాగే రాజేష్‌కి ఆరోగ్య సమస్య వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళితే కొన్ని టెస్టులు చేస్తారు. అతనికి క్యాన్సర్ అని తేలుతుంది. ఈ విషయం రాజేష్ కంటే ముందు దేవి అన్నయ్యకు తెలుస్తుంది. దీంతో పెళ్లి వాయిదా వేయిస్తాడు.
ఆ తర్వాత తనకు క్యాన్సర్ అనే విషయం తెలుసుకుంటాడు రాజేష్. ఇక అప్పటి నుంచి దేవిని దూరం పెట్టడం మొదలుపెడతాడు. పెళ్లి చేసుకొని ఆమెకు అన్యాయం చెయ్యకూడదనుకుంటాడు. దేవి పెళ్లి చేసుకొని సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. అందుకే తనకు ఎన్నో దుర్వసనాలు ఉన్నాయని ఆమెను నమ్మించే ప్రయత్నం చేస్తాడు. దాని కోసం స్నేహితులతోపాటు తన తండ్రి సహాయం కూడా తీసుకుంటాడు. తను జయంతి అనే వేశ్య ఇంట్లో ఉన్నాడనే సమాచారం రాజేష్ తండ్రి దేవికి చెబుతాడు. జయంతితో కలిసి ఆడిపాడడాన్ని కళ్లారా చూసిన దేవి తట్టుకోలేకపోతుంది. ఒకరోజు జయంతి ఇంటి వెళ్లి రాజేష్‌ని నిలదీస్తుంది. అయితే జయంతి ముందే దేవిని అవమానించి పంపిస్తాడు రాజేష్. దాంతో అతనంటే దేవికి అసహ్యం ఏర్పడుతుంది. ఆ కోపంతోనే తన అన్నయ్య స్నేహితుడైన ప్రసాద్‌ని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి తర్వాత రాజేష్‌కి క్యాన్సర్ అనీ, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుసుకుంటుంది దేవి. అతన్ని చూసేందుకు తన భర్త, కుటుంబసభ్యులతో బయల్దేరుతుంది. అలాగే రాజేష్ కుటుంబ సభ్యులు కూడా జయంతి ఇంటికి చేరుకుంటారు. ప్రసాద్, దేవిలను పెళ్లి దుస్తుల్లో చూసి ఎంతో సంతోషిస్తాడు రాజేష్. ఆ ఆనందంతోనే కన్నుమూస్తాడు. ఇదీ ‘ప్రేమాభిషేకం’ కథ.
జ్యోతి, ప్రేమాభిషేకం చిత్రాలకు సంబంధించిన మూల కథ ఒకటే అనిపిస్తుంది. అయితే కథనాల్లో, బ్యాక్‌డ్రాప్‌లో ఎంతో తేడా ఉన్నప్పటికీ క్యాన్సర్ అనే అంశం రెండు సినిమాల్లోనూ ఒకేలా ఉంటుంది. జ్యోతి చిత్రంలో తనకు క్యాన్సర్ అని తెలిసి, ఎక్కువ రోజులు బ్రతకదని తెలిసి హీరో తనని అసహ్యించుకునేలా చేస్తుంది. ప్రేమాభిషేకం చిత్రంలో తనకు క్యాన్సర్ అని తెలుసుకున్న హీరో తన ప్రేమను త్యాగం చేసి హీరోయిన్ తనను అసహ్యించుకొని వేరే పెళ్లి చేసుకునేలా చేస్తాడు. చివరికి జ్యోతి చిత్రంలో హీరోయిన్, ప్రేమాభిషేకం చిత్రంలో హీరో కన్నుమూయడంతో సినిమా ముగుస్తుంది. నిజానికి ఈ రెండు కథలూ ఒకటే. కానీ, రెండు సినిమాల్లోని పాత్రల తీరు తెన్నులు వేరుగా ఉండడం, కథనంలో ఎంతో వ్యత్యాసం ఉండడంతో ప్రేక్షకులు దాన్ని గుర్తించే అవకాశం లేకుండాపోయింది. అయితే ఎలా చూసినా జ్యోతి కంటే ప్రేమాభిషేకం పెద్ద విజయం సాధించిన సినిమాగా చెప్ప్పుకోవాలి.
![]() |